ఇది తిట్టు కాదు గురూ

 ఈరోజు అనగా జూలై 3, 2022 ఈటీవీ సినిమాలో ఎస్వీఆర్ జయంతి సందర్భంగా “జగత్ జెట్టీలు” అనే పాత సినిమా వేసారు. మధ్య మధ్యలో చాలా సార్లు ఏదో ఒక అవాంతరం వచ్చినా చివరి వరకు టీవీ ఆపకుండా చూసాను. ఇంకో సినిమా లో ఎస్వీఆర్ గారు విలన్ నీ విలన్ గ్యాంగ్ వాళ్ళనీ “గూట్లే” అని తిడుతూండేవారు. అయితే ఈ సినిమాలో విలన్ ని “డోంగ్రే” అనీ, వ్యాంప్ (అంటే ఆడ విలన్ అన్నమాట) ని “డుంగ్రీ” అని పిలుస్తారు. సినిమాలో ఇదో రకం మసాలా అన్నమాట. ఈ ఎస్వీఆర్ గారి పిలుపులు చిన్న వయసులోనే లోపల కంఠస్థం అయిపోయాయి.


అయితే, నేను ఛత్తీస్గఢ్ లోని బిలాస్పూర్ లో బ్యాంకు మేనేజర్ గా ఉన్నప్పుడు నాగపూర్ ఆర్వో నుండి ఒక ప్రెమిసెస్ ఆఫీసర్ వచ్చారు. ఆయన పేరు డోంగ్రే. అవినాష్ డోంగ్రే. అయితే అక్కడ సర్నేమ్ తో పిలుస్తారు కనుక అందరూ ఆయన్ను డోంగ్రే అని పిలిచేవారు. నాకు ఆయన్ను మిస్టర్ డోంగ్రే అని పిలిస్తే తిట్టుగా భావించి బాధపడతాడేమోనని కొంచెం సంకోచం గా ఉండేది. కొన్ని సార్లు పిలిచాక అలవాటై పోయింది.


ఇలా ఒక ప్రాంతం మాట ఇంకో ప్రాంతంలో తిట్టుగా మారే అవకాశాలు ఉన్నాయి.


చాలా సంవత్సరాల క్రితం నేను కలకత్తాలో పని చేసేటప్పుడు అక్కడ సంజయ్ ముండా (ఝార్ఖండ్ ప్రాంతీయుడు) అని ఒక అటెండర్ ఉండేవాడు. కొన్నాళ్ళు అతన్ని ముండా అని పిలిస్తే కోపం తెచ్చుకుంటాడేమోనని, నావైపు చూసేవరకు ఆగి, సైగ చేసి రమ్మనేవాడిని. ముండా అని పిలిస్తే పాపం నవ్వుతూనే వచ్చేవాడు. తరువాత కొన్నాళ్ళకు ధైర్యం గా పిలవడం అలవాటు చేసుకున్నాను.

 

అలాగే ఇంకో అటెండర్ అభాస్ అనేవాడుండే వాడు. అతన్ని మాత్రం ధైర్యంగా పేరు పెట్టే పిలిచే వాడిని, నన్ను అభాసు పాలు చేయడులే అనే ధైర్యంతో.


Comments

Popular posts from this blog

Mukhbir (ముఖ్బీర్)

Matti Kushti

Crime Thrillers in Telugu Cinema